భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

13-11-2026 | 07:52pm

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివలింగ కృష్ణ

గజ్వేల్‌, నవంబర్ 13 : భవన నిర్మాణ కార్మికులు(Construction workers) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం(AITUC Construction Workers' Union) జిల్లా ప్రధాన కార్యదర్శి శివలింగ కృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శుక్రవారం గజ్వేల్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గజ్వేల్‌ ఏఎల్‌ఓ కార్యాలయంలో, సిద్దిపేట ఏసీఎల్‌ అధికారికి వినతిపత్రాలు అందజేశారు.

పెండింగ్‌ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని, 50 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలని కోరారు. పేద కార్మికులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్య అందించాలని, సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని, ద్విచక్ర వాహనాలపై 100 శాతం రాయితీ కల్పించాలని కోరారు.

ఏఐటీయూసీ పోరాటంతో సాధారణ మరణ పరిహారం రూ.2 లక్షలకు, ప్రమాద మరణ పరిహారం రూ.10 లక్షలకు పెరిగేలా కృషి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీరుల కనకయ్య, కొండకింది పోచయ్య, జాలగామ నర్సింలు, జంగిటి మల్లేశం, పేట బాబు, మొట్ట శీను, బిక్షపతి, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు