కామారెడ్డి మున్సిపల్ సమావేశం గరం గరం
బిల్లులు లేపడం తప్ప ప్రజా సంక్షేమం పట్టని కామారెడ్డి కౌన్సిల్
పోడియం వద్ద బైఠాయించిన బిజెపి, బీఆర్ఎస్ కౌన్సిలర్ లు
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం(Kamareddy Municipal General Body Meeting) గరం గరంగా సాగింది. మొదట శానిటేజెషన్, విధి దీపాలు, చెత్త సేకరించే(Sanitation, street lights, waste collection) ఆటోల సమస్య పరిష్కారం చూపిన తర్వాతనే మిగతా ఎజెండా అంశాలు చర్చకు రావాలని బీజేపీ, బిఆర్ఎస్ కౌన్సిలర్(BJP, BRS Councilor)లు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ గత 9 నెలలుగా కొత్త పాలక వర్గం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటికీ శానిటైజేషన్ సమస్యకి పరిష్కారం చూపలేదని, చెత్త ఆటోల క్రమం తప్పకుండా రావడం లేదని అన్నారు, వీధి దీపాల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని ఈ సమస్యలు గాలికి వదిలి బిల్లులు లేపేందుకు సర్వసభ్య సమావేశం పెట్టీ తీర్మానాలు చేద్దాం అని చూస్తున్నారని ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు చైర్ పర్సన్ భర్తకు గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు.
చైర్ పర్సన్ భర్త తన ఇష్టానుసారంగా కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ పరిపాలనలో అధికారులు, చైర్ పర్సన్ కృషి చేయాల్సింది పోయి చైర్ పర్సన్ భర్త చెప్పిన మాటలకు విలువ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తమ వార్డులో కనీసం శానిటేషన్ పనులు కూడా జరగడం లేదని బిజెపి బీఆర్ఎస్ కౌన్సిలర్ లు ఆరోపించారు. తాము చెప్పిన మునిసిపల్ సిబ్బంది పట్టించుకోవడంలేదని కేవలం మున్సిపల్ చైర్పర్సన్ భర్త చెప్పిన వార్డులలో మాత్రమే పనులు చేస్తున్నారని తాము కౌన్సిలర్ గా ఉన్నా కూడా తమ మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ పండగలు బతుకమ్మ, దసరా , వినాయక చవితి ఏర్పాట్ల లో నిర్లక్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ధనాన్ని ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వం అని అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రతి వార్డుకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని వార్డులలో మాత్రమే పనులు చేస్తూ మిగతా వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి మాట్లాడుతూ ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని చెప్పారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తే అభివృద్ధి జరగదని తెలిపారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు సమన్వయంతో అభివృద్ధి విషయంలో ఒకే తాటి పైకి వస్తే పనులు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, టీపిఓ, దయాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.