మినీ రిజ‌ర్వాయ‌ర్‌గా ఫాక్స్ సాగ‌ర్

13-11-2026 | 07:43pm

ప‌నుల‌ను ప్రారంభించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి చెరువు అభివృద్ధికి శ్రీ‌కారం

ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు మినీ ట్యాంక్‌బండ్ గా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు

కుత్బుల్లాపూర్, నవంబర్ 13(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా(Medchal District) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పరిధిలోని ఎంతో చారిత్ర‌క వైభ‌వం ఉన్న ఫాక్స్ సాగ‌ర్ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను(Restoration works of Fox Sagar) హైడ్రా శుక్ర‌వారం ప్రారంభించింది. ఆక్ర‌మ‌ణ‌లతో పాటు దుర్గంధాన్ని తొల‌గించి చెరువుకు కొత్త రూపునిచ్చేందుకు హైడ్రా శ్రీ‌కారం చుట్టింది. హైడ్రా క‌మిష‌న‌ర్  ఏవీ. రంగ‌నాథ్(HYDRA Commissioner A.V. Ranganath) శుక్ర‌వారం భూమి పూజ చేసి ఫాక్స్‌సాగ‌ర్ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను ప్రారంభించారు.

అనంత‌రం హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ... జీడిమెట్ల‌  ఫాక్స్ సాగర్ చెరువును పునరుద్ధరించి, మినీ రిజర్వాయర్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాది కాలంలో ఇక్క‌డ అద్భుత‌మైన స‌ర‌స్సును చూడ‌బోతున్నార‌ని పేర్కొన్నారు. చెరువు రూపురేఖలు మారి.. మినీ ట్యాంక్ బండ్‌గా దీనిని తీర్చిదిద్దుతామ‌న్నారు. మురుగు నీరు, కెమిక‌ల్‌ వ్య‌ర్థాల‌తో దుర్గంధ‌భ‌రితంగా ఈ చెరువు మారిపోయిందని తెలిపారు. పెద్ద‌మొత్తంలో పూడిక ఉండ‌డంతో భూమిలోకి నీరు ఇంక‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

దీంతో ఈ ప‌రిస‌రాల్లో భూగ‌ర్భ జ‌లాలు త‌గ్గిపోవ‌డ‌మే కాదు, కొద్ది మొత్తంలో ఉన్నా,అవి క్యాన్స‌ర్ వంటి భ‌యంక‌ర వ్యాధుల‌కు కార‌ణ‌మ‌య్యేవిగా మారాయన్నారు. ఇలాంటి త‌రుణంలో ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్ది, శుద్ధ జలాల‌తో నింపాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని తెలియజేశారు. ఆ దిశ‌గా హైడ్రా చ‌ర్య‌లు చేప‌ట్టిందని, ఒక‌ప్పుడు మురుగునీరు, గుర్ర‌పుడెక్క‌తో చెరువు ఉణికినే కోల్పోయే విధంగా ఉన్న మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట నేడు ఎంతో సుంద‌రంగా హైడ్రా తీర్చిదిద్దిందని అన్నారు.అలాగే  ఫాక్స్ సాగ‌ర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్న‌ట్టు తెలిపారు. 

5 మీట‌ర్ల మేర పూడిక తొల‌గింపు..

ప్లాస్టిక్‌, కెమిక‌ల్ వ్య‌ర్థాల‌తో భూమిలోకి నీరు ఇంక‌ని ప‌రిస్థితి ఉంది. 5 మీట‌ర్ల మేర పూడిక‌ను తొల‌గించి ప్ర‌స్తుతం 1000 మిలియ‌న్ లీట‌ర్ల సామ‌ర్థ్యానికి ప‌రిమిత‌మైపోయిన ఫాక్స్ సాగ‌ర్ చెరువును 4 వేల మిలియ‌న్ లీట‌ర్ల‌కు పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నులు జ‌రుతున్నాయ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు. పూడికను తొల‌గించ‌డం ద్వారా  భూగ‌ర్భ జ‌లాలు పెరిగే అవ‌కాశం ఉంటుందని, చెరువు అభివృద్ధికి ముందు త‌ర్వాత‌.. జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ ద్వారా చెరువు నీటితో పాటు.. ప‌రిస‌రాల్లోని భూగ‌ర్భ జ‌లాల‌ను ప‌రీక్షించ‌నున్నామ‌న్నారు.

చెరువులోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జ‌లాలు నేరుగా చేరకుండా సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. చెరువులోకి వ‌ర‌ద నీరు చేరేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు..  2000లో వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరదనీటి నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేస్తామ‌ని చెప్పారు. చెరువు క‌ట్ట‌ను ప‌టిష్టం చేయ‌డ‌మే కాకుండా.. చెరువు ఇన్‌లెట్లు, ఔట్ లెట్లు స‌రిగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 

హెరిటేజ్ ను కాపాడుతాం...

1897లో నిజాం పాలకుల కాలంలో ఈ చెరువును నిర్మించారు. సాగునీటితో పాటు.. సికింద్రాబాద్ ప్ర‌జ‌ల‌కు తాగు నీరు అందించేందుకు దీనిని నిర్మించిన‌ట్టు చ‌రిత్ర చెబుతోంది. ఈ చెరువు నీరు నేరుగా హుస్సేన్‌సాగ‌ర్‌కు చేరేలా వ‌ర‌ద కాలువ‌లు కూడా ఉన్నాయి. ఈ చెరువు కట్టపై నిర్మించిన పురాతన రాతి పంప్‌హౌస్ ద్వారా తాగు నీటి స‌ర‌ఫ‌రా ఉండేది. ఇప్పుడా రాతి పంప్ హౌస్ దెబ్బ‌తినింది. వాటిని పునరుద్ధరించేందుకు యూరప్‌కు చెందిన నిపుణుల సహకారం తీసుకుంటాం.

చెరువు చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు. దాదాపు 500ల ఎక‌రాల ప‌రిధిలో ఉన్న ఈ చెరువులో 150 ఎకరాల మేర ఆక్రమణలను గుర్తించామ‌ని.. వాటిని ఇప్ప‌టికే చాలావ‌ర‌కు తొల‌గించామ‌న్నారు. 2024 జులై 19 హైడ్రా ఏర్ప‌డ‌డానికి ముందు ఉన్న నివాస గృహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని స్పష్టం చేశారు. 

అక్క‌డ కొన్ని లే ఔట్లున్నాయ‌ని.. ఎవ‌రైనా ప్లాట్లు, భూములు కోల్పోతే వారికి నిబంధనల ప్రకారం టీడీఆర్ ల‌భిస్తుంద‌న్నారు.  చెరువు ప్రధాన కట్ట, దాని పరిసర ప్రాంతాల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ బఫర్ జోన్‌ను పది మీటర్ల మేర పరిగణనలోకి తీసుకుంటామ‌న్నారు. కట్ట దిగువన ఉన్న ఆలయాలు, ఇతర నిర్మాణాల విషయంలోనూ వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు