ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విస్తరణోపన్యాసాలు
మల్కాజిగిరి, నవంబర్ 13,(విజయక్రాంతి): మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College, Malkajgiri) కంప్యూటర్ సైన్స్, వృక్షశాస్త్రం విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక విస్తరణోపన్యాస కార్యక్రమాలను నిర్వ హించారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఇంచార్జ్ డాక్టర్ మల్లిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. యమునా రాణి ముఖ్య అతిథిగా విచ్చేసి,
విద్యార్థులకు 'సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్‌లో స్ట్రక్చర్స్, యూనియన్స్, ఫైల్స్' అనే అంశంపై అవగాహన కల్పించారు. అలాగే, వృక్షశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. లలిత ఆధ్వర్యంలో జరిగిన మరో కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. రచన ముఖ్య వక్తగా హాజరై, విద్యార్థులకు 'ఔషధ మొక్కలు', వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. బండి రాజు ఆధ్వర్యంలో ఇద్దరు అతిథి అధ్యాపకులను శాలువా, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.