పోచారం ఇంట దసరా సంబరాలు!

21-10-2026 | 11:39am

బాన్సువాడ, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తన స్వగ్రామం పోచారంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా సంప్రదాయబద్ధంగా వాహన పూజలు (Vehicle Pooja) నిర్వహించి విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు.ప్రతి ఏడాది విజయదశమి రోజున పోచారం కుటుంబం నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి జెండాను తీసుకువచ్చారు. అనంతరం పోచారం నివాసం సమీపంలోని మహబూబ్ సుభాని దర్గా వద్ద జెండాను ఎగురవేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సంప్రదాయం మతసామరస్యం (Religious Harmony), సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోంది.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని రామాలయాన్ని సందర్శించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ యువత ప్రతిష్ఠించిన దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.విజయదశమి సంప్రదాయంలో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాలపిట్టను దర్శించుకున్నారు. పండుగను కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పరిగె వెంకట్ రామ్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు