కుటుంబ సమేతంగా మంత్రి పొంగులేటి పూజలు

21-10-2026 | 11:24am

ఎర్రుపాలెం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విజయదశమి (Vijayadashami) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఎర్రుపాలెం మండలంలోని ప్రసిద్ధ జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంతో పాటు తక్కెళ్లపాడులోని శ్రీ లలితా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.

మూడు తరాల కుటుంబ సభ్యులతో దైవదర్శనం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి స్వరాజ్యమ్మ, సతీమణి మాధురమ్మ, కుమారుడు హర్షారెడ్డి, కోడలు సోమారెడ్డి, మనుమరాలు మైరారెడ్డి, కుమార్తె సప్నిరెడ్డి, అల్లుడు అర్జున్‌రెడ్డి, మనవడు ఆరవ్‌రెడ్డితో కలిసి ఆలయాలకు వెళ్లారు. మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.

వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు

జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబానికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు వేదమంత్రాల నడుమ ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలను సమర్పించారు. అనంతరం తక్కెళ్లపాడులోని శ్రీ లలితా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దసరా పర్వదినాన దైవదర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాల్లో పూజల్లో పాల్గొనడంతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు