ఎట్టకేలకు విద్యాశాఖ ఉక్కుపాదం
అనుమతి లేని పాఠశాలపై చర్యలు
బాన్సువాడ శ్రీ చైతన్య స్కూల్ 8, 9 తరగతులు సీజ్
బాన్సువాడ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల(Sri Chaitanya School) వ్యవహారంపై ఎట్టకేలకు విద్యాశాఖ చర్యలకు దిగింది. పాఠశాలలో అనుమతులు లేని 8, 9వ తరగతి గదులను బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వర్రావు గురువారం సీజ్ చేశారు. విద్యాశాఖ నుంచి అనుమతులు వచ్చే వరకు ఆయా తరగతులు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
విజయక్రాంతి దినపత్రికలో వరుసగా ప్రచురితమైన కథనాలతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారగా, విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విజయక్రాంతి ప్రచురించిన వరుస కథనాల నేపథ్యంలో ఈ వ్యవహారంలో అధికారులు తీసుకున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాఠశాలల నిర్వహణలో నిబంధనల అమలు, విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణే కీలకంగా మారనుంది.
వరుస కథనాలతో అధికారుల్లో కదలిక...
శ్రీ చైతన్య పాఠశాలలో 8, 9వ తరగతుల అనుమతుల వ్యవహారంపై గతంలో విజయక్రాంతి పలు కథనాలను ప్రచురించింది. అనుమతులపై స్పష్టత లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారనే అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్పందించి, సంబంధిత తరగతి గదులను సీజ్ చేయడంతో పాఠశాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అనుమతులు లేకుంటే తరగతులు లేనట్టే...
విద్యాశాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందే వరకు 8, 9వ తరగతులు నిర్వహించరాదని ఎంఈఓ ఆదేశించినట్లు తెలిసింది. నిబంధనలకు అనుగుణంగా అనుమతులు పొందిన తర్వాతే తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో పాఠశాల యాజమాన్యం తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలి
పాఠశాలల అనుమతుల విషయంలో విద్యాశాఖ నిబంధనలు కచ్చితంగా అమలుకావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అదే సమయంలో విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతుల వ్యవహారంపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వడంతో పాటు, నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.