పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి
సందర్శకులు సులభంగా వీక్షించేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, నవంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎల్లమ్మ తండా సమీపంలోని ఖందకాల ప్రాంతంలో ఉన్న చారిత్రక రాతి చిత్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాతిపై చిత్రించిన ప్రాచీన చిత్రాలను స్వయంగా వీక్షించి, వాటి ప్రత్యేకతలు, చారిత్రక ప్రాధాన్యతను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని రాతిపై వీబీ–జీ రామ్ జీ అనే అక్షరాలు రాసి ఉండటాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతం ప్రధాన రహదారికి సమీపంలో ఉండటంతో పర్యాటకులు సులభంగా చేరుకుని చారిత్రక రాతి చిత్రాలను వీక్షించేందుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా పరిరక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు. రాతి చిత్రాల చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు, సందర్శకులు సులభంగా వీక్షించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయమైన చారిత్రక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సురేందర్, ఎంపీడీఓ ప్రవీణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.