సరస్వతి సమాఖ్య మహిళా సంఘాలకు రుణాలివ్వాలి
మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన సీపీఎం నేతలు
గజ్వేల్, నవంబర్ 4: గజ్వేల్ పట్టణంలోని సరస్వతి ఎస్ఎల్ఎఫ్ పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులందరికీ రుణాలు మంజూరు చేయడంతో పాటు గ్రూపుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సంతబోయిన ఎల్లయ్య(CPM leader Santaboyina Ellaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సీపీఎం నాయకులు, డ్వాక్రా సంఘాల సభ్యులతో కలిసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ సరస్వతి ఎస్ఎల్ఎఫ్ పరిధిలో గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి ఆర్పీ, సీఓలను తొలగించడంతో పాటు కేసులు నమోదు చేశారని తెలిపారు. అయితే గత రెండేళ్లుగా ఈ పరిధిలోని డ్వాక్రా సంఘాలను పట్టించుకునే వారు లేకపోవడంతో సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
సంఘాలకు రుణాలు మంజూరు చేయడం లేదని, గ్రూపుల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంఘాల సభ్యులు సీఓను కలిసినా ఆర్పీ లేదనే సమాధానం వస్తోందన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి డ్వాక్రా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, గ్రూపులు సక్రమంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని, సభ్యులందరికీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రంగారెడ్డి, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.