విద్యార్థులను అభినందించిన విశ్రాంత ప్రధాన ఎన్నికల అధికారి
కొత్తపల్లి (విజయక్రాంతి): జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అరుదైన విజయాలు సాధించి కరీంనగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన పారమిత హెరిటేజ్ పాఠశాల(Paramita Heritage School) విద్యార్థులు, ఉపాధ్యాయుడు లలిత్ మోహన్ సాహును బుదవారం రోజున కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి, ఆర్డీఓ షర్మిల, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతిరావు సత్కరించి, అభినందనలు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఐటీఎం యూనివర్సిటీలో అక్టోబర్ 23 నుంచి 28 వరకు నిర్వహించిన 21వ అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం 'ఉద్భవ్ ఉత్సవ్-2026'లో పారమిత హెరిటేజ్ పాఠశాల మ్యూజిక్ బ్యాండ్ బృందం అద్భుత ప్రతిభ కనబరిచి గ్రూప్ మ్యూజికల్ బ్యాండ్ విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
వివిధ దేశాలకు చెందిన సంగీత బృందాలతో పోటీపడి ఈ ఘనత సాధించడం విశేషం. అదేవిధంగా వాద్య సంగీతం సోలో విభాగంలో 8వ తరగతి విద్యార్థి కిట్ల చరణ్ ప్రథమ స్థానం, ఏవీకే క్రితిక్ ద్వితీయ స్థానం సాధించారు. అదే విధంగా పారమిత హెరిటేజ్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు, ప్రాజెక్ట్స్ అండ్ ఇన్నోవేషన్ హెడ్ లలిత్ మోహన్ సాహు దేశవ్యాప్తంగా ఎంపికైన టాప్-10 వినూత్న ఉపాధ్యాయుల్లో ఒకరిగా నిలిచారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 28న నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ ఫెలోషిప్‌ను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, ఉపాధ్యాయుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధించిన ఈ విజయాలు సంస్థకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ వినోద్ రావు, ఉపాధ్యాయులు లలిత్ మోహన్ సాహు, జితుమణి శర్మ, కిరణ్, సాహు, విద్యార్థులు పాల్గొన్నారు.