ఆదర్శ గ్రామంగా లింగంపల్లి కుర్దును తీర్చిదిద్దాలి

04-11-2026 | 06:58pm

నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి..

ఉపాధి హామీ పనుల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయం..

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, నవంబర్ 4 (విజయక్రాంతి): లింగంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి కుర్దూ గ్రామంలో కలెక్టర్ మొక్కలను నాటారు, జిల్లాలోని గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు, నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టి పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలపాలన్నదే జిల్లా యంత్రాంగం లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.   

జిల్లాలో ఇప్పటికే తాడువాయి మండలం లోని  ఎండ్రియాల్, దోమకొండ మండలంలోని గోటిముక్కల గ్రామాల్లో ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు, తాజాగా లింగంపల్లి కుర్దు గ్రామాన్ని మూడో ప్లాస్టిక్ రహిత గ్రామంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, పర్యావరణ హిత ఇటుకల తయారీ, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, బోరుబావుల. లింగంపల్లి కుర్దు గ్రామంలో 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్ల లోతుతో నిర్మించే ఇంకుడు గుంతకు సుమారు రూ.6,500 అంచనా వ్యయం అవుతుందని వివరించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు రాబోయే రబీ సీజన్‌లో వరి సాగుపైనే ఆధారపడకుండా జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని, సాగులో తగిన జాగ్రత్తలు పాటించి నష్టాలు రాకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేయాలని తెలిపారు.

కూరగాయల సాగు, ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు, ఆదాయం పొందవచ్చని వివరించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సురేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, సర్పంచ్ ప్రత్యూష సాయిరాం, ఉపసర్పంచ్ కుమ్మరి సంతోష్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు