చిరుత పాదముద్రలు గుర్తింపు

27-11-2026 | 10:10pm

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామచందర్

జుక్కల్, నవంబర్ 27 (విజయక్రాంతి): జుక్కల్ మండలం(Jukkal Mandal) కౌలాస్ ఫారెస్ట్ బీట్(Kaulas Forest Beat) పరిధిలో చిరుత(Leopard) సంచారానికి సంబంధించిన పాదముద్రలను శుక్రవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. సావర్గం నుంచి లింగంపల్లి(Lingampalli) వెళ్లే రహదారి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామచందర్(Forest Beat Officer Ramchander) సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు రామచందర్ తెలిపారు. చిరుత సంచారంపై గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా అటవీ ప్రాంతాలు, పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చిరుత సంచారం ఉన్నట్లు అనుమానం వచ్చినా, దాని ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కౌలాస్ ఫారెస్ట్ బీట్ పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించకుండా అటవీశాఖకు సహకరించాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామచందర్ కోరారు.

మరిన్ని వార్తలు