వేర్వేరు కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు

27-11-2026 | 11:05pm

వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, సీఐ రవిబాబు 

ఎల్బీనగర్, నవంబర్ 27 : వనస్థలిపురం పోలీస్ స్టేషన్(Vanasthalipuram Police Station) పరిధిలో నమోదైన రెండు కేసుల్లో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు ఏసీపీ కాశిరెడ్డి(ACP Kashireddy) ప్రత్యేక సమావేశం నిర్వహించి, దొంగతనం, దోపిడీ కేసు వివరాలను వెల్లడించారు. దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు, రిసీవర్ ని అరెస్టు చేసి, సుమారు రూ. 40 లక్షల విలువైన 36 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల రవీందర్(30) ఉపాధి కోసం మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ మండలం నారపల్లిలో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. ఇతను సులభంగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేస్తున్నాడు.

ఇందులో భాగంగా ఈ నెల 22న వనస్థలిపురంలోని కమలానగర్ లో నివాసం ఉంటున్న రిటైర్ ఆర్టీసీ ఉద్యోగి మండలిక సాయి సత్యనారాయణ మూర్తి ఇంట్లో రవీందర్ దొంగతనం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఆటోనగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న రవీందర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడెంలో నివాసం ఉంటున్న నేనావత్ కృష్ణ కు ఇచ్చాడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రవీందర్ పై గతంలో 25 కేసుల్లో నిందితుడి అని తెలిపారు. 

- దారి దోపిడీ కేసులో ముగ్గురు అరెస్టు 

ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దారిదోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పనామా ఎక్స్ రోడ్డులో వాహనాల తనిఖీల సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసానగర్ కు చెందిన మహ్మద్ ఫైజన్(22), మహ్మద్ అక్బర్(20), వేముల రాకేశ్(23) ముగ్గురు స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించడానికి ఒంటరిగా ఉన్నవారిని కత్తులతో బెదిరించి సెల్ ఫోన్లు, నగదు చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో వనస్థలిపురంలో ఉంటున్న ఆటోడ్రైవర్ రవి కుమార్ పై 24న అర్ధరాత్రి ప్రాంతంలో వనస్థలిపురంలోని కెఎల్ఎం షాపింగ్ మాల్ సమీపంలో ఆటోలో ఉండగా దాడి చేసి, సెల్ ఫోన్ చోరీ చేశారు.

అనంతరం  వనస్థలిపురంలోని మల్లికార్జున నగర్ కమాన్ సమీపంలో మేఘావత్ రమేశ్ (క్యాబ్ డ్రైవర్) పై  బైక్‌పై వచ్చి, కారు తలుపు తెరిచి అతడిపై దాడి చేసి, వివో  మొబైల్ ఫోన్‌ను దొంగిలించి పారిపోయారు. రమేష్ వారిని వెంబడించగా, ఒకరు కడుపులో కత్తితో పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ రవిబాబు, డీఐ రాజేశ్, సీసీఎస్ సీఐ గోవింద్, కరణ్, ఎస్సై రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు