అక్రమ నిర్మాణం కూల్చివేత

27-11-2026 | 11:03pm

హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు 

ఎల్బీనగర్, నవంబర్ 27 : అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టాలను కూల్చివేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు(Town Planning Officials) హెచ్చరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం(LB Nagar Constituency) చింతలకుంట డివిజన్ పరిధిలో అక్రమ భవనంపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) అధికారులు ఉక్కు పాదం మోపారు. ఎంఎంసీ అధికారులు నోటీసులతో సరిపెట్టకుండా కూల్చివేతలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. చింతలకుంట డివిజన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక వైపు అనుమతులు లేకుండా సెల్లార్ తో కూడుకున్న ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎంఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం అక్రమంగా నిర్మించిన సెల్లార్ లో కూల్చివేతలు చేపట్టారు.

హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అజ్మీరాస్వామి ఆదేశాల మేరకు ఏసీపీ విజయలక్ష్మి పర్యవేక్షణలో టీపీవో సోమశేఖర్, చైన్ మెన్ తిరుమలేశ్, ప్రకాశ్, చంద్రయ్య, సాయి, ప్రవీణ్ తదితర బృందంతో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా సెల్లార్ నిర్మించి, అంతస్తులు పెంచుకుంటూ పోతే ఊరుకోబోమని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, నిర్మాణం ఎవరిదైనా కూల్చివేత తప్పదని తేల్చి చెప్పారు. కూల్చివేతలు చేపడుతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సీఐ రవిబాబు ఆదేశాల మేరకు ఎస్సె నాగరాజు తమ సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలు చేపడతామని టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు