ఎమ్మార్పీఎస్ పేరుతో మందకృష్ణ మాదిగ కోట్లు దండుకున్నారు

13-11-2026 | 05:12pm

తాడ్వాయి,నవంబర్,13( విజయక్రాంతి ): ఎమ్మార్పీఎస్(MRPS) పేరుతో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) కోట్ల రూపాయలు దండుకున్నారని సీనియర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చిట్యాల సాయన్న మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన చిట్యాల సాయన్న శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన సీనియర్ ఎమ్మార్పీఎస్ ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ఎమ్మార్పీఎస్ స్థాపించి ఇప్పటికీ 32 సంవత్సరాలు అవుతుందని, ఎమ్మార్పీఎస్ తో మాదిగలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో మాదిగలకు చెప్పులు, డప్పులు తదితర ఎన్నో రకాల ప్రయోజనాలు సమకూరేవని, ఎమ్మార్పీఎస్ ఏర్పాటు తర్వాత మాదిగలకు అన్యాయమే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాదిగలను గుర్తించి మాదిగలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.కాంగ్రెస్ నాయకులు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మాదిగలకు దళిత బంధు కింద రూ.12 లక్షలు అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లారం రత్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవరావు,నాయకులు మోహన్ రావు,నిర్మల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు