పర్యాటక రంగానికి ఉతం

09-11-2026 | 12:39pm
  1. 12 కోట్ల రూపాయల పనుల తో పర్యాటక రంగానికి ఉతం
  2. శరవేగంగా జరుగుతున్న ఏకో టూరిజం పనులు
  3. హర్షం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు

నిజాంసాగర్ నవంబర్ 09(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project) ప్రాంతం పర్యాటక రంగంలో కొత్త వెలుగులు సంతరించుకుంటోంది. పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం చేపట్టిన కాటేజీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.

​రూ. 12 కోట్లతో అత్యాధునిక కాటేజీల నిర్మాణం

​కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక, చారిత్రక కట్టడమైన నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు భారీ ప్రణాళికలు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు రూ. 12 కోట్ల భారీ నిధులతో పర్యాటకుల కోసం అత్యాధునిక హంగులతో కూడిన కాటేజీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులను జుక్కల్ శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని పర్యవేక్షిస్తున్నారు.

​జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక కృషితో రూపుదిద్దుకుంటున్న హరివిల్లు

​నియోజకవర్గ పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టును ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జుక్కల్ ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన చేసిన విశేష కృషితోనే ఈ ప్రాజెక్ట్ వద్ద పర్యాటక అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరయ్యాయి. ప్రాజెక్టు అందాలను తిలకించడానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మంజీరా నదిపై నిర్మించిన ఈ చారిత్రక ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు, జలకళ సంతరించుకున్న జలాశయం, పచ్చని చెట్లతో కూడిన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ​

ఇంతవరకు ఇక్కడ సరైన బస సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడేవారు. రూ. 12 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ కాటేజీలు అందుబాటులోకి వస్తే పర్యాటకులు రాత్రి సమయాల్లో  ఇక్కడ బస చేసి ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. వీకెండ్స్‌, సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా నిజాంసాగర్ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పట్ల, ప్రకృతి అందాల పట్ల తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వీకెండ్ డెస్టినేషన్‌గా మారుతుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ కాటేజీల నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే, నిజాంసాగర్ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు