వ్యక్తి బలవన్మరణం
కరీంనగర్ క్రైం, నవంబర్ 9 (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్(Karimnagar Rural Police Station) పరిధిలోని కేసీఆర్ బిల్డింగ్ సమీపంలో చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అక్కడ లభించిన చీటీలోని సెల్ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మృతుడి కుమారుడు సాయికృష్ణ తన తండ్రిగా గుర్తించాడు.మృతుడు అనంతుల సత్యనారాయణ (46) వడ్రంగి పని చేసేవాడు. గతంలో తీగలగుట్టపల్లిలోని సరస్వతి నగర్లో నివాసం ఉండగా, ప్రస్తుతం గణేష్ నగర్లో ఉంటున్నాడు. సుమారు 15 ఏళ్ల క్రితం భార్యతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో మరో మహిళతో సహజీవనం సాగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఆరు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో సత్యనారాయణ కాలు విరగడంతో పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న మహిళ సైతం అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులకు దూరంగా, ఒంటరిగా జీవిస్తున్న సత్యనారాయణ కాలు గాయం కారణంగా ఉపాధి పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
కేసీఆర్ బిల్డింగ్(KCR Building) సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిన సత్యనారాయణ గడ్డి మందు తాగి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, మరణానికి గల కచ్చితమైన కారణాలు నిర్ధారించేందుకు పోస్టుమార్టం జరిపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు.