పీఎంపీ,ఆర్ ఎంపీ లపై దాడులు నిలిపివేయాలి
తాడ్వాయి,నవంబర్,13( విజయ క్రాంతి): పిఎంపీ,ఆర్ ఎంపీలపై టిజీఎంసి దాడులు(TGMC raids) నిర్వహిస్తుందని,ఈ దాడులను వెంటనే నిలిపివేయాలని పిఎంపి,ఆర్.ఎం.పి జిల్లా అసోసియేషన్ అధికార ప్రతినిధి(District Association Spokesperson) సిహెచ్ రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో శుక్రవారం ఆర్ ఎం పి,పి ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో పిఎంపి,ఆర్ఎంపి గ్రామీణ వైద్యుల పై టిజీఎంసీ దాడులు నిరంతరంగా కొనసాగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గత ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న పీఎంపీ,ఆర్ఎంపీల పొట్ట కొట్టడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో పిఎంపి, ఆర్.ఎం.పి కుటుంబాలు ఆగమాగమవుతున్నాయన్నారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి టీజీఎంసి దాడులను నిలిపివేయాలని ఆయన కోరారు.ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్ఎంపి,పిఎంపీలను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించారని తెలిపారు.
అందులో విద్యార్హత కలిగిన వారికి కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇప్పించి పరీక్షలు నిర్వహించారని వివరించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాడులు నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మానేటి కృష్ణ,కార్యదర్శి దేవయ్య,ఉపాధ్యక్షులు తుమ్మ శంకర్,మండల కార్యదర్శి తుమ్మ రవీందర్,పట్టణ కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.