నిషాముక్తి భారత్ మోది లక్ష్యం
నిర్మల్ నవంబర్ 13 ( విజయక్రాంతి): నిషా ముక్తి భారత్(Addiction-Free India) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లక్ష్యమని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'నషా ముక్త్ యువ వికసిత్ భారత్' అనే అంశంపై నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. యువత తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యక్తిగత అభివృద్ధితోపాటు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత చైతన్యవంతంగా ముందుకు రావాలని, మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా తోటి వారిలోనూ అవగాహన కల్పించాలని సూచించారు.
మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్, అధ్యాపకులు రజిత పీజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.