ఉద్యమకారుల అరెస్టులెందుకు? హామీల అమలేది?
బాన్సువాడ, నవంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (Telangana Movement Activists Forum) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్త తీవ్రంగా ఖండించారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం సరైన చర్య కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగిన గుర్తింపు, గౌరవం, న్యాయం లభించడం లేదనే మనస్తాపంతో లక్ష్మణ్ గౌడ్ తన సూసైడ్ లేఖలో (Suicide Note) ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమకారులందరినీ తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఉద్యమకారుల ఆవేదనను అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి గొంతు నొక్కే విధంగా ముందస్తు అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే తగిన ఆర్థిక సహాయం అందించి, అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాధన కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇకనైనా అమలు చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమకారుల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉడుత గంగాధర్ గుప్త స్పష్టం చేశారు.