అమరవీరుల ఆశయ సాధనకు పోరాటాలే నిజమైన నివాళి

05-11-2026 | 03:56pm

కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరులకు విప్లవ జోహార్లు

బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): కమ్యూనిస్టు విప్లవోద్యమంలో దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం, దోపిడీ, పీడనల నుంచి విముక్తి కోసం, భూమి, భుక్తి, విముక్తి సాధన కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల ఆశయాల సాధనకు పోరాటాలను కొనసాగించడమే వారికి అందించే నిజమైన నివాళి అని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ అన్నారు.

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ సభల్లో భాగంగా గురువారం బోధన్ పట్టణంలోని పాన్ గల్లీలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమం వందేళ్ల ప్రస్థానంలో ఎందరో ఉద్యమకారులు దేశం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక, కర్షకుల హక్కుల కోసం, విద్యార్థులు, యువజనులు, మహిళల హక్కుల కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు.

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న), డీవీకే అన్న, కర్నాటి యాదగిరన్న, రాయల చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కామ్రేడ్ ఎల్లన్న, కిరణ్ కుమార్, శావులం సాయన్న, అంజక్క, వినోద, పడాల రాములు తదితరులు ఉద్యమ పోరాటాల్లో అమరులయ్యారని గుర్తుచేశారు. వారి త్యాగాలను స్మరించుకోవడం అంటే కేవలం నివాళులర్పించడం మాత్రమే కాదని, వారు చూపిన పోరాట మార్గంలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం నిరంతరం ఉద్యమించడమే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. సీతారాం, ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, టీయూసీఐ బోధన్ పట్టణ నాయకులు ఎం.డి. ఇర్షాద్, బొంతల సాయిలు, సుల్తాన్ సాయిలు, శ్రీను, సత్యనారాయణ, గంగాధర్, ఎల్. గంగామని, పడాల లక్ష్మి, దేవ్ బాయి, లింగామని, సావిత్రి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు