నవోదయ ప్రవేశ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
టీఆర్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్ డిమాండ్
బాన్సువాడ, నవంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) ఈ నెల 28న నిర్వహించనున్న 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్షను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని టీఆర్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాలోని బాన్సువాడ, బిచ్కుంద పరీక్షా కేంద్రాల పరిధిలో పేపర్ లీకేజీకి సంబంధించిన ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు.
ఈ విషయంపై విద్యార్థులు, ప్రజలు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఏడాదైనా పరీక్షా నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించి, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశ్నపత్రాల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు బయటకు వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, ఇన్విజిలేటర్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బాన్సువాడ టీఆర్పీ ఇన్చార్జి కాసీం, జిల్లా యూత్ వింగ్ నాయకులు నవీన్, రాజు, అశోక్, గాండ్ల జ్ఞానేశ్వర్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.