కరీంనగర్ సీటీసీలో అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్ ప్రారంభం

25-11-2026 | 09:59pm

కరీంనగర్ క్రైం, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ నేర పరిశోధన విభాగం, స్థానిక పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో, అగ్రిగోల్డ్(AgriGold) బాధితుల డిపాజిట్ బాండ్లు, రసీదుల పరిశీలన  ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. కరీంనగర్‌లోని సిటీ ట్రైనింగ్ సెంటర్ లో ఈ ప్రత్యేక వెరిఫికేషన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. పని దినాల్లో ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు బాండ్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. రద్దీని నివారించేందుకు డిపాజిటర్లు పోలీసు శాఖ కేటాయించిన మండలాల వారీ తేదీల ప్రకారమే హాజరుకావాలని సూచించారు.

బాధితులు తమ ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్లు/రసీదులతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకురావాలి. డిపాజిటర్ మరణించినట్లయితే, వారి వారసులు మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ , తమ గుర్తింపు కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. పరిశీలన నిమిత్తం మాత్రమే ఒరిజినల్ బాండ్లను చూపించాలని, వాటిని తిరిగి డిపాజిటర్లకే ఇచ్చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. జిరాక్స్ కాపీలు సమర్పించిన తర్వాత అధికారిక రసీదు  ఇవ్వబడుతుందన్నారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి తదితరపరిధిలోని అర్హులైన అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీలలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు