దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి
కరీంనగర్ సభను విజయవంతం చేయాలి..
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
హుజురాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న కరీంనగర్లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Former MP Boinapally Vinod Kumar) పిలుపునిచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్లో జమ్మికుంట పట్టణ, మండలంతో పాటు ఇల్లంతకుంట, వీణవంక మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్యంగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లోనే చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటిచెప్పిన పోరాటమని పేర్కొన్నారు. ఉద్యమ చరిత్రను, అమరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దీక్షా దివస్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కేసీఆర్ పోరాట పటిమ, పట్టుదలతోనే తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగిందని పేర్కొన్నారు. నవంబర్ 29న కరీంనగర్లో జరిగే సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభకు జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, పార్టీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణం, వీణవంక మండలంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యతను వివరిస్తూ నవంబర్ 29న జరిగే సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, వైస్ చైర్మన్ జావీద్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ వాలా బాలకిషన్ రావు, మాజీ జడ్పీటీసీ సాదవ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.