సమాజ సేవకు అంకితం కావాలి
అక్రమాలను అడ్డుకోవడంలో చట్టాలపై అవగాహన కీలకం
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కేవలం పట్టాలు పొందడమే లక్ష్యంగా కాకుండా, సమాజంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడంలో బాధ్యతాయుత పాత్ర పోషించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, అడ్వకేట్ జి. కిరణ్ కుమార్(Bar Council of India member G. Kiran Kumar) పిలుపునిచ్చారు. గురువారం కిమ్స్ కాలేజ్ ఆఫ్ లా(KIMS College of Law)లో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకుని, సామాన్య ప్రజలకు న్యాయపరమైన సేవలు అందించేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని సూచించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు, క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా న్యాయ విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు న్యాయవృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, చట్టాల అమలు, న్యాయస్థానాల విధులు, న్యాయవాదుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ పేర్యాల రవీందర్ రావు మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు అడ్వకేట్‌గా మారే క్రమంలో కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, న్యాయస్థానాల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. న్యాయవాదుల వృత్తి ధర్మం, నైతిక విలువలు, ప్రజలకు న్యాయం అందించడంలో వారి పాత్రను తెలుసుకోవాలన్నారు.
ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించడంలో చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. విద్యార్థులను న్యాయవాద వృత్తికి సమర్థవంతంగా తీర్చి దిద్దడమే కిమ్స్ విద్యా సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నవీన్ కుమార్, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.