శ్రీ గురుపీఠంలో సాయిబాబా, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు

13-11-2026 | 01:01am

ప్రత్యేక హారతులు.. భక్తులకు అన్నదాన

శివంపేట్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట్ మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠం(Sri Gurupeetham)లో గురువారం సందర్భంగా సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గురుపీఠాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

గురువారం రోజున సాయిబాబా, దత్తాత్రేయ స్వామివార్లను ఆరాధించడం ఎంతో విశిష్టమైనదని, భక్తులకు ఆధ్యాత్మిక చింతనతో పాటు సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు అన్నదానం చేయడం ద్వారా సేవా భావాన్ని చాటుకున్న ట్రస్ట్ చైర్మన్ దంపతులు, సభ్యులను భక్తులు అభినందించారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ కార్యక్రమం భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.

మరిన్ని వార్తలు