డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తుకు ముప్పు
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..
పిల్లల భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
చందనాపూర్లో మిషన్ పరివర్తనలో అవగాహన కార్యక్రమంలో డీసీపీ బి. రామ్ రెడ్డి
రామగిరి, నవంబర్12 విజయక్రాంతి) మాదకద్రవ్యాలు(Anti-Drug) లేని అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి(Peddapalli DCP B. Ram Reddy) పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గురువారం రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో, రెండో పట్టణ సీఐ ఎన్. ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీసీపీ బి. రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, గ్రామ ప్రజలకు డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. చెడు స్నేహాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటూ విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త ఎస్.పి. నాయక్ మహారాజ్, సీఐ ఎన్. ప్రసాదరావు, ఎస్సై ఎన్. లక్ష్మణ్, చందనాపూర్ సర్పంచ్ కొండ మంజుల-శ్రీనివాస్, ఉపసర్పంచ్ చిగురు రజిత-రామచందర్, సింగిరెడ్డిపల్లి సర్పంచ్ జుల యమున-శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పేరాల మహేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ ఏలువాక ఓదెలు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేడి లక్ష్మి, పోలీసు సిబ్బంది, పోలీసు కళాబృందం సభ్యులు పాల్గొన్నారు. చందనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిపి సుమారు 200 మంది కార్యక్రమానికి హాజరయ్యారు.