ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
- బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
- ఎల్బీనగర్ లో నల్ల బ్యాడ్జీలతో విద్యార్థుల నిరసన
ఎల్బీనగర్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement), స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థుల సంఘం కన్వీనర్ కడారి శివకుమార్ యాదవ్(BC Students' Association Convener Kadari Shivakumar Yadav), బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం ఎల్బీనగర్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ర్యాలీలో ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ, 8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, షరతులు లేకుండా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపల్లి అంజి, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, అంజిగౌడ్, సిద్ధప్ప యాదవ్ తదితరులు పాల్గొన్నారు.