ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు
రూ.7 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు..
బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల విలువ
ఎల్బీనగర్ లోని బైరామల్ గూడలో ఉన్న ఇంట్లో తనిఖీలు
ఎల్బీనగర్: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ అండ్ క్యాడ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) ఆర్. సత్యనారాయణ (44) నివాసంతోపాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో 10 ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి.
ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం బైరామల్గూడలోని మాధవరం సెరెనిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఆయన నివాసంతోపాటు మొత్తం 10 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి వెల్లడించారు. అధికారుల తనిఖీల్లో 25 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు, 50 తులాల బంగారు ఆభరణాలు, వివిధ ప్రాంతాల్లో నాలుగు ఇళ్లకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం గుర్తించిన అక్రమ ఆస్తుల విలువ సుమారు రూ.7 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని డీఎస్పీ చలపతి పేర్కొన్నారు. ఇంకా తొమ్మిది ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.