శివాజీనగర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాల సీజ్
కరీంనగర్ క్రైం, నవంబర్ 25 (విజయక్రాంతి): పోలీసులకు , ప్రజలకు మధ్య సత్సంబంధాలను, ప్రజా భద్రతపై అవగాహన కల్పించేందుకు కరీంనగర్(Karimnagar) టౌన్ డివిజన్ పరిధిలోని శివాజీనగర్‌లో బుధవారం 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్' నిర్వహించారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వన్ టౌన్,టూ టౌన్, త్రీ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు , టౌన్ డివిజన్ సబ్-ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పలు కీలక అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ భద్రతా పద్ధతులు సైబర్ నేరాలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేసే విధానంపై ప్రజలకు వివరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యల గురించి వివరిస్తూ, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా కాలనీలను డ్రగ్స్ రహితంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.
నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు ప్రజా భద్రత కోసం నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలందరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని అధికారులు సూచించారు.