రికార్డులన్నీ ఇచ్చేశాం
- మరి విజిలెన్స్ రిమైండర్ ఎందుకు?
- మున్సిపల్ కార్పొరేషన్ వివరణతో కొత్త ప్రశ్నలు
కరీంనగర్ క్రైం, నవంబర్ 27 (విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో(Karimnagar Municipal Corporation) డీజిల్ వినియోగం(Diesel Bill), ఇంధన బిల్లుల రీయింబర్స్మెంట్(Reimbursement of fuel bills) వ్యవహారంపై కొనసాగుతున్న విచారణ మరో కీలక మలుపు తిరిగింది. డీజిల్ బిల్లుల అంశంపై 'విజయక్రాంతి'లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు(Municipal Corporation officials) తమ వివరణను వెల్లడించారు. సంబంధిత రికార్డులు, పత్రాలు, వివరాలన్నింటినీ ప్రాంతీయ సంచాలకులు, పురపాలక పరిపాలన, వరంగల్‌తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్(Vigilance and Enforcement) అధికారులకు ఇప్పటికే సమర్పించినట్లు శుక్రవారం విడుదల చేసిన రిజయిండర్లో పేర్కొన్నారు. విచారణలో అవకతవకలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం నిర్ధారణ అయితే సంబంధిత ఉద్యోగులపై(Employees') నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రికార్డులు ఇచ్చినట్లయితే రిమైండర్ ఎందుకు?
కార్పొరేషన్ వివరణలో పేర్కొన్న అంశాలు ఒకవైపు ఉంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నవంబర్ 23న జారీ చేసిన రిమైండర్ మరోవైపు ఉంది. అక్టోబర్ 14న ఇదే వ్యవహారంపై సమాచారం కోరుతూ లేఖ పంపిన విజిలెన్స్ అధికారులు, నవంబర్ 23న మరోసారి రిమైండర్ జారీ చేశారు. ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆడిట్ నివేదికతో పాటు కీలక రికార్డులు అవసరమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అన్ని రికార్డులు ఇప్పటికే సమర్పించామని కార్పొరేషన్ చెబుతున్న నేపథ్యంలో, విజిలెన్స్ శాఖ మరోసారి రిమైండర్ ఎందుకు పంపాల్సి వచ్చిందన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
కార్పొరేషన్ సమర్పించిన రికార్డులు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేక విచారణకు అవసరమైన మరికొన్ని కీలక పత్రాలు అందాల్సి ఉందా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో ఆడిట్ అభ్యంతరాలపై చర్యలెక్కడ అనే విషయం సంచలనంగా మారింది. 2026 ఫిబ్రవరి 7న వెలువడిన తెలంగాణ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) నివేదికలోని పరిశీలనలు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. ఆ నివేదికలోని అభ్యంతరాలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన ఎటీఆర్ ను విజిలెన్స్ కోరింది.
అలాగే ఆడిట్లో గుర్తించిన లోపాలకు బాధ్యులైన అధికారుల పేర్లు, హోదాలు, వారు విధులు నిర్వహించిన కాలం, వారి బాధ్యతల వివరాలను కూడా సదరు లేఖలో కోరింది. ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లినట్లయితే ఎంత మొత్తం రికవరీ చేశారు.. ఇంకా ఎంత రికవరీ చేయాల్సి ఉంది అనే వివరాలూ విచారణలో కీలకమైనవే. అయితే కార్పొరేషన్ ఇచ్చిన తాజా వివరణలో ఈ అంశాలపై నిర్దిష్టమైన వివరాలు వెల్లడించలేదు. ఆడిట్ అభ్యంతరాలపై తీసుకున్న చర్యలు, రికవరీ వివరాలను బహిర్గతం చేస్తేనే అసలు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
విచారణలో తేలితే చర్యలంటున్న అధికారులు
విజిలెన్స్, పురపాలక పరిపాలన అధికారుల సమగ్ర విచారణ అనంతరం ఏవైనా అవకతవకలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం జరిగినట్లు నిర్ధారణ అయితే సంబంధిత ఉద్యోగులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ తన వివరణలో పేర్కొంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, బాధ్యత నిర్ధారణ ఇంకా జరగాల్సి ఉందని కార్పొరేషన్ వైఖరి స్పష్టం చేస్తోంది. మరోవైపు విజిలెన్స్ శాఖ కూడా అవసరమైన రికార్డులను కోరుతూ రిమైండర్ జారీ చేయడం ఈ వ్యవహారంపై విచారణ ఇంకా కొనసాగుతున్నదనే విషయాన్ని సూచిస్తోంది.
డీజిల్ వినియోగం, ఇంధన బిల్లుల చెల్లింపులు ప్రజాధనంతో ముడిపడిన అంశాలు కావడంతో, సదరు వ్యవహారంలో ఎవరి తప్పిదమైనా ఆధారాలతో వెలుగులోకి రావాలనీ నగర ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేయని ఉద్యోగులపై అనవసర ఆరోపణలు పడకూడదని, అదే సమయంలో తప్పిదాలు నిర్ధారణ అయితే బాధ్యులు ఎవరు.. ప్రభుత్వానికి జరిగిన నష్టమెంత.. ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు ఏ చర్యలు తీసుకున్నారు అన్నది ప్రజలకు తెలియాలని వారు కోరుతున్నారు.
కార్పొరేషన్ చెబుతున్నట్లుగా అన్ని రికార్డులు సమర్పించి ఉంటే, వాటి సమర్పణ తేదీలు, అధికారుల నుంచి అందిన స్వీకరణ ఆధారాలు, ఆడిట్ అభ్యంతరాలపై తీసుకున్న చర్యలను వెల్లడించడం ద్వారా ఈ వ్యవహారంపై నెలకొన్న సందేహాలకు తెరదించవచ్చనేది కాదనలేని సత్యం. ఇలాంటి సమయంలో కథనాలు ప్రచురించిన సంస్థలకు మాత్రమే వివరణ ఇవ్వకుండా నగర ప్రజలకు పూర్తి స్థాయిలో నిజా నిజాలు తెలిసేలా వివరాలు వెల్లడించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా విజిలెన్స్ విచారణలో వెలువడే వాస్తవాలపైనే అందరి దృష్టి నెలకొంది అనేది మాత్రం వాస్తవం.