యువ ఆపద మిత్ర శిక్షణకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఎంపిక
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University) పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు(NSS volunteers) యువ ఆపద మిత్ర పథకానికి ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 16 నుండి 22వ తేదీ వరకు ఒక వారం పాటు మంచిర్యాల జిల్లాలోని 13వ బెటాలియన్, గుడిపేట్ వద్ద విపత్తు నిర్వహణపై శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వాలంటీర్ కు సుమారు ₹10,000 విలువైన విపత్తు సహాయక సామగ్రి కిట్ ను అందించడంతో పాటు, బీమా సదుపాయం కూడా కల్పించనున్నారు. శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం నుంచి 120 మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు రెండు బస్సుల్లో మంచిర్యాల కు బయలుదేరారు. ఈ బస్సులను శాతవాహన విశ్వవిద్యాలయం ఓ ఎస్ డి డా. డి. హరికాంత్ మరియు జిల్లా యువజన అధికారి శ్రీ జి. తిరుపతి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.