మహాత్మా జ్యోతిబా పూలే జీవిత కథతో ఫూలే సినిమా
22-11-2026 | 09:22pm
ముకరంపుర, నవంబర్ 22 (విజయక్రాంతి): భారత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జీవిత కథ ఆధారంగా రూపొందించిన 'ఫూలే' సినిమాను ప్రజలంతా విజయవంతం చేయాలని చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర కోరారు. ఆదివారం కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న తెలంగాణలోని థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా మహిళలు, దళితులు, బహుజనులు, విద్యార్థులకు పూలే జీవితాన్ని, ఆయన చేసిన పోరాటాన్ని అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
దేశంలో వర్ణ వివక్ష(Caste Discrimination), అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్రను, స్త్రీ జాతికి విద్యను అందించేందుకు చేసిన కృషిని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించామని రవిచంద్ర పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు, సామాజిక సంస్కరణలు(Social Reforms) నేటి తరానికి తెలియజేయడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని వివరించారు.
ఈ సమావేశంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ పూలే చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యదర్శి లక్ష్మీ గౌతమ్ మాట్లాడుతూ సంస్థ అధ్యక్షుడు రవిచంద్ర నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రాన్ని కరీంనగర్ ప్రజలంతా ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎల్లాపి సంఘం జిల్లా బాధ్యులు రాచకొండ చక్రధర్ రావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు, బీసీ సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాకేష్, బోనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.