శ్రీ మహాశక్తి ఆలయంలో ప్రారంభమైన ‘గురు చరిత్ర’ ప్రవచనం
26 వరకు దేవాలయంలో కొనసాగనున్న ప్రవచన కార్యక్రమం
కరీంనగర్, నవంబరు 20 (విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కరీంనగర్(Karimnagar) లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో(Sri Maha Shakti Temple) జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులతో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు(Spiritual activities) ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శుక్రవారం నుంచి ఈనెల 26 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ గురు చరిత్ర ప్రవచన కార్యక్రమం జరగనుంది.
పౌరాణిక ప్రవచనకర్త, ప్రవచన చక్రవర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ గురు చరిత్ర ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతోపాటు 21న సాయంత్రం 6 గంటలకు శ్రీ తులసీ దామోదర కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 24న కార్తీక పౌర్ణమి సందర్బంగా ఉదయం 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకపూజలు, 8 గంటల నుండి సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.