సీఎం స్థాయికి వ్యక్తిగత విమర్శలు తగవు

20-11-2026 | 10:28pm

రేవంత్ రెడ్డి తీరుతో కలుషితమవుతున్న తెలంగాణ రాజకీయాలు 

ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి

గజ్వేల్, నవంబర్ 20 : మాజీ మంత్రి హరీష్ రావుపై(Harish Rao) సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగవని ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి(MLC Dr. Vanteru Yadav Reddy) విమర్శించారు. శుక్రవారం గజ్వేల్‌లో(Gajwel) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. సీఎం హోదాలో ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిలో కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విమర్శలు మాని రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతు బీమా పథకం విధానాన్ని మార్చి రైతు కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

పథకాలకు పేర్లు మార్చడం కాకుండా తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూ హుందాగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

మరిన్ని వార్తలు