గిరిజన ప్రాంతాల ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలి..

04-11-2026 | 11:39pm

*ఆసుపత్రుల నిర్వహణ, వైద్యుల నియామకం, వైద్య పరికరాల కల్పనపై సమగ్ర సమీక్ష....

*కొమరం భీం జిల్లా  కలెక్టర్ కె. హారిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు....

ఉట్నూర్, నవంబర్04 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచి, గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హారిక(District Collector Harika), సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు సూచించారు.

బుధవారం గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సిబ్బంది నియామకాలు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, వైద్య పరికరాల లభ్యత, ఆసుపత్రుల అభివృద్ధి పనులు తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రుల వారీగా మంజూరైన కేడర్ బలం, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, ఖాళీగా ఉన్న పోస్టుల స్థితిగతులను సమీక్షించారు. వైద్య సిబ్బంది కొరత కారణంగా రోగులకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా ఆసుపత్రులకు కేటాయించిన బడ్జెట్, ఇప్పటివరకు చేసిన ఖర్చులు, మిగిలి ఉన్న నిధుల వివరాలను పరిశీలించారు. కొత్తగా ప్రతిపాదించిన అభివృద్ధి పనులు, ఇప్పటికే మంజూరైన పనులు, వాటి అమలు పురోగతి, ఆసుపత్రుల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలను గుర్తించి, వాటిని సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఆసుపత్రుల నిర్వహణ సజావుగా సాగడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు 'యు కోట్ – వి పే (You Quote – We Pay)' విధానంలో వైద్యులను నియమించుకునే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ విధానంలో వైద్యులు తమకు ఆమోదయోగ్యమైన పారితోషికాన్ని ప్రతిపాదిస్తే, దానికి అనుగుణంగా చెల్లింపులు జరిపి గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించడంపై సమీక్షించారు.

గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం వైద్య సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచాలని కలెక్టర్, ప్రాజెక్టు అధికారి సూచించారు.

గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, వైద్య సిబ్బంది కొరతను అధిగమించడం, అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే సమీక్ష సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

మరిన్ని వార్తలు