ఎస్ఐఆర్ పై ఆందోళనలు అవసరం లేదు
*ప్రజ్ఞా భారతి సదస్సులో ప్రముఖ పాత్రికేయులు సురేష్ కొచ్చెట్టిల్..
హనుమకొండ, నవంబర్ 04 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించే ఎస్ఐఆర్(SIR) ప్రక్రియ, దాని వెనుక ఉన్న రాజ్యాంగబద్ధమైన అవసరాలు, ఓటర్ల జాబితా ఆధారిత తొలగింపులపై సాగుతున్న ప్రచారాలపై ప్రజలలో ఆందోళన అవసరం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చటిల్ అన్నారు. ప్రజ్ఞ భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ పై హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.
ప్రజ్ఞా భారతి వరంగల్ శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ రామ్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు చట్టబద్ధంగా తీసుకునే ప్రమాణ స్వీకారానికి మరియు ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులు (ఎంపీ, ఎమ్మెల్యే లేదా మంత్రులు) పదవీ బాధ్యతలు చేపట్టే ముందు "చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగాన్ని రక్షించి, కాపాడతాను" అని ప్రమాణ స్వీకారం చేస్తారని గుర్తుచేశారు. అందువల్ల రాజ్యాంగబద్ధమైన ఎస్ఐఆర్ ప్రక్రియను కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపై ఉందని తెలిపారు.
ఎస్ఐఆర్ చరిత్ర మరియు గత అనుభవాలు
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొత్తదేమీ కాదని, గతంలో 8 సార్లు నిర్వహించబడిందని వివరించారు. ఇందులో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే (జవహర్లాల్ నెహ్రూ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కాలంలో) జరిగాయని తెలిపారు. వాజ్‌పేయి హయాంలో కూడా ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. 2001-2002 నాటి ఎస్ఐఆర్ తర్వాత దాదాపు 24 సంవత్సరాలుగా పూర్తిస్థాయి సవరణ జరగలేదని ప్రస్తావించారు.
ఎస్ఐఆర్ సమగ్ర పరిశీలన సమయంలో జాబితా నుండి పేర్లను తొలగించడానికి ప్రధానంగా 4 కారణాలు ఉంటాయని స్పష్టం చేశారు. దానిలో మొదటిది బిఎల్ఓలు (బూత్ లెవల్ అధికారులు) ఇళ్లకు వెళ్లినప్పుడు ఓటర్లు అందుబాటులో లేకపోవడం. రెండవది మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం. మూడవది ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల వేరే నగరాలకు/రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోవడం. నాలుగవది ఒకే వ్యక్తి పేరు సాంకేతిక లోపాలు లేదా చిరునామా మార్పుల వల్ల రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నమోదై ఉండటం.
హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి వంటి అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, పెబల్ సిటీ వంటి పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో బిఎల్ఓలు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించడం లాజిస్టికల్‌గా ఎంతో కష్టతరమైన పనని వివరించారు. బీహార్‌లో తొలిదశ ఎస్ఐఆర్ సందర్భంగా 67 లక్షల ఓటర్ల పేర్లను తొలగించినప్పుడు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయని, అయితే క్షేత్రస్థాయిలో రీ-అప్లై లేదా డిలీషన్ సవరణలకు అవకాశం ఇచ్చినా నమోదులు అత్యల్పంగానే నమోదయ్యాయని ప్రస్తావించారు.
పశ్చిమ బెంగాల్లో 1971 బంగ్లాదేశ్ యుద్ధం నాటి నుండి భారీగా చొరబాట్లు జరగడం, నకిలీ పదవ తరగతి సర్టిఫికేట్లు/రేషన్ కార్డులతో ఓటరు గుర్తింపు సాధించడం వంటి అంశాలు ఎస్ఐఆర్ మ్యాపింగ్‌లో స్పష్టంగా బయటపడ్డాయని విశ్లేషించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటు హక్కును కాలరాయడానికి కాదని, ఓటర్ల జాబితాలో ఉండే అక్రమాలను, బోగస్ ఓట్లను ఏరివేసి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రముఖ అడ్వకేట్ చామర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.