ఆదర్శ గ్రామంగా ఇల్లూరు
మధిర, నవంబర్ 5 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఏజేఏవై (PM-AJAY) పథకం కింద ఆదర్శ గ్రామపంచాయతీగా మధిర మండలంలోని ఇల్లూరు గ్రామం ఎంపికైంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఎంపిక చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామస్థుల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
ఇల్లూరు గ్రామం ఎంపికకు కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరికి సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా, మండల అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.