ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల నమోదు
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హరిత(Collector K. Haritha) అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అర్హులైన వారికి పథకం వర్తిస్తుందని, 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తారని తెలిపారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తుల వివరాలను తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి గురువయ్య, డీపీఓ బిక్షపతి, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.