జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాడుతాం

07-10-2026 | 07:06pm

టియూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ

సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడుదాం:జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని టియుడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ(Virahat Ali) పునరుద్ఘాటించారు. జిల్లా కేంద్రంలోని ఏ రోజ్ గార్డెన్ లో సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా మహాసభకు జిల్లా కలెక్టర్ హరిత, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అంతకముందు జిల్లాలోని మృతి చెందిన జర్నలిస్టులు ఆత్రం తుకారం, శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు జారీతో పాటు పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. వీటి కోసమే నిరంతరం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సంఘాలు పుట్టుకు వచ్చాయని ప్రస్తుతం వాటి పుట్టుకే ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

అంతకుముందు జిల్లాలోని పలువురు జర్నలిస్టులు మాట్లాడిన సమస్యలపై స్పందిస్తూ కష్టం ఉన్నచోట తమ సంఘం ఉంటుందన్నారు. గౌరవం కోసం మాత్రమే వృత్తి నిర్వహించేవారు అనేక మంది ఉన్నారని, అయితే కొన్ని శక్తులు డబ్బుల కోసం వస్తూ ప్రెస్ గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ సంఘం పార్టీలకతీతంగా పనిచేస్తుందని ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సమస్య పరిష్కరించాలన్నారు.

అక్రిడేషన్ లు అనేక సంస్థలు డబ్బులు తీసుకొని ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, జర్నలిస్ట్ పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వకుంటే జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కొమరం భీమ్ స్ఫూర్తితో పోరాడుతామన్నారు. హెల్త్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బహిరంగ సభలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చుకోలేకపోయారని అన్నారు. ప్రభుత్వాలకు జేజేలు కొట్టకుండా జర్నలిస్టుల తరఫున నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ అధికారులు జర్నలిస్టులు సమన్వయంతో పని చేసినప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

సమాజంలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం ఆమెను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉంటూ పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐక్యతనే మహాబలమని , నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్, జిల్లా కోశాధికారి ఆడప సతీష్, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్  జిల్లాలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు