ఆల్ఫోర్స్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
హనుమకొండ, అక్టోబర్ 7(విజయ క్రాంతి): ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్(Alfores Junior College) హనుమకొండ లో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలన్నారు.
బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమయ్యే తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థినులకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
విద్యార్థినీలతో కలిసి మహిళా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది బతుకమ్మ వేడుకలలో పాల్గొని పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి, సునీత, శ్రీనివాస్, రాధిక, మమత, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.