ఆవిన్‌కు కొత్త ల్యాబ్.. సీఎం విజయ్ ప్రారంభం

07-10-2026 | 07:39pm

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మాధవరం(Madhavaram)లో ఆవిన్ డెయిరీ(Aavin Dairy)కి సంబంధించి కీలక కార్యక్రమాలు జరిగాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్(CM Joseph Vijay) ఆవిన్ రాష్ట్ర కేంద్ర ప్రయోగశాల కొత్త అనుబంధ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ భవనాన్ని సుమారు రూ.2.23 కోట్లతో నిర్మించినట్లు అధికారులు తెలిపారు. కొత్త ల్యాబ్‌లో ఆధునిక పరికరాలతో పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతను మరింత వేగంగా, కచ్చితంగా పరీక్షించే సదుపాయాలు ఏర్పాటు చేశారు.

అలాగే తాగునీరు, వ్యర్థజలాల నాణ్యతను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షించే సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ ప్రారంభం అనంతరం సీఎం విజయ్ మాధవరం కేంద్ర డెయిరీ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. పాల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, పంపిణీ ప్రక్రియలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాధవరం డెయిరీ(Madhavaram Aavin Dairy) ప్రస్తుతం రోజుకు సుమారు 4.5 లక్షల లీటర్ల పాలను నిర్వహించే సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇదే సమయంలో మాధవరంలో నిర్మాణంలో ఉన్న కొత్త డెయిరీ ప్రాజెక్టు పనులను కూడా సీఎం విజయ్ పరిశీలించారు.

భవిష్యత్‌లో చెన్నై(Chennai) నగర పాల అవసరాలను తీర్చే లక్ష్యంతో సుమారు రూ.152.26 కోట్లతో ఈ కొత్త డెయిరీని నిర్మిస్తున్నారు. ఆధునిక ఆటోమేషన్‌తో కూడిన ఈ యూనిట్‌కు రోజుకు సుమారు 7 లక్షల లీటర్ల పాల నిర్వహణ సామర్థ్యం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇటీవల చెన్నైలో ఆవిన్ పాల లభ్యతపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీఎం మాధవరం డెయిరీని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాల సేకరణ నుంచి వినియోగదారులకు చేరే వరకు మొత్తం సరఫరా వ్యవస్థను ఆయన సమీక్షించారు.

మరిన్ని వార్తలు