కొత్తూరు గ్రామంలో వరి పంటలను పరిశీలించిన అధికారులు
కూసుమంచి, అక్టోబర్ 7(విజయ క్రాంతి): కూసుమంచి మండలంలోని కొత్తూరు గ్రామంలో వరి పొలాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి(Agricultural Officer Ramadugu Vani ) పరిశీలించారు. పంటను పరిశీలించిన అనంతరం వరి పంటలో బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు , కంకి నల్లి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలిపారు.రైతులు ఈ చీడ పీడల నివారణకు తగిన చర్యలు పాటించాలని సూచించారు.
బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు నివారణకు,స్ట్రెప్టోసైక్లిన్ 30 గ్రాములు + కాపర్ ఆక్సీక్లోరైడ్ 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. ఈ తెగులు కనిపించిన పొలాల్లో అధికంగా యూరియా వేయకుండా, పొలంలో నీటిని నిల్వ ఉంచకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
వరిలో ప్రస్తుత పరిస్థితుల్లో కంకి నల్లి అధికంగా ఉందని దీని నివారణకు స్పైరోమెసిఫిన్ 22.9% ఎస్సీ 200 మీ.లీ మందును 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలకంఠం, వ్యవసాయ విస్తరణ అధికారి రఘు మరియు రైతులు పాల్గొన్నారు.