పల్లె ప్రకృతి వనంలో పచ్చదనం హతం!

07-10-2026 | 07:46pm
  1. పెద్ద చెట్లకు కత్తెర.. మద్యం, పేకాటకు అడ్డాగా మారిన వనం!
  2. పంచాయతీ పాలకుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

కొల్చారం, అక్టోబరు 7 :ప్రభుత్వం పచ్చదనం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం(Palle Prakruti Vanam ) నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని రంగంపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలోని పల్లె ప్రకృతి వనంలో పెద్దపెద్ద చెట్లను నరికివేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు చెట్లను నరికివేస్తుండగా.. మరోవైపు పల్లె ప్రకృతి వనం మద్యం ప్రియులకు, పేకాటరాయుళ్లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నా గ్రామపంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి పెంచిన పచ్చదనాన్ని కాపాడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీపై ఉన్నప్పటికీ.. పర్యవేక్షణ కొరవడటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్ల నరికివేతను అడ్డుకోవడంతో పాటు, పల్లె ప్రకృతి వనాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు