ఇంటి ఆవరణలో గంజాయి సాగు..

07-10-2026 | 07:40pm

పోలీసుల మెరుపుదాడి,సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ 

మూడు మొక్కలు స్వాధీనం

కోటపల్లి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల అక్రమ సాగు, విక్రయాలు, రవాణాపై పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకొంటుంది. అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నమ్మదగిన సమాచారం ఆధారంగా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు ఇంటి ఆవరణలో సాగు చేస్తున్న గంజాయి(Cannabis) మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుళ్లబందం గ్రామంలో చోటుచేసుకుంది.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ పర్యవేక్షణలో పోలీసులు దాడి నిర్వహించారు. కోటపల్లి ఎస్‌ఐ శివనీతి రాజశేఖర్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జె. లక్ష్మణరావు సిబ్బందితో కలిసి అందిన విశ్వసనీయ సమాచారంపై ఎదుళ్లబందం గ్రామానికి చెందిన దుర్గం మహేష్ (33) ఇంటి ఆవరణలో తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఇంటి ఆవరణలో సాగు చేస్తున్న మూడు గంజాయి మొక్కలు పోలీసుల కంటపడ్డాయి. దీంతో మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ ఏఈఓ పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న మొక్కల్లో రెండు సుమారు 12 అంగుళాలు, మరో మొక్క 14 అంగుళాల ఎత్తు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4,600 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

గంజాయి సాగుకు ఇంటి ఆవరణనే అడ్డాగా మార్చుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత ముమ్మరం చేస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

గంజాయి సాగు, విక్రయాలు, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పదంగా గంజాయి సాగు లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ రాజశేఖర్ ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు