అంతా మా ఇష్టం.. బోర్డు పెట్టేది మేమే..!
- చెత్త వేసేది మేమే..!
- ఫైన్ కట్టేది ఎవరు..?
- హెచ్చరిక బోర్డు పక్కనే చెత్త కుప్పలు
- అధికారుల తీరుపై విమర్శలు
కాగజ్నగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): బోర్డు పెట్టేది మేమే.. జరిమానా విధించేది మేమే.. మరి చెత్త వేసేది కూడా మేమే? కాగజ్నగర్ మున్సిపాలిటీ(Kagaznagar Municipality)లో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే వ్యక్తమవుతున్నాయి. రోడ్డు పక్కన చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు, అదే ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోతుండటంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్వినయ్ గార్డెన్ మధ్య రహదారి పక్కన ఈ పరిస్థితి నెలకొంది. పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ అధికారులు పలు చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్డు పక్కన చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ప్రజలకేనా?
రోడ్డు పక్కన చెత్త వేయవద్దని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తామని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే, అదే బోర్డు ఉన్న ప్రాంతంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందే చెత్తాచెదారం వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గత కొంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజలు చెత్త వేస్తే జరిమానాలు విధించే అధికారులు, తమ సిబ్బంది విషయంలోనూ అదే నిబంధనలు అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా సేకరించిన చెత్తను రహదారుల పక్కన వేయకుండా, నిర్దేశించిన ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉందని పేర్కొంటున్నారు.
పరిశుభ్రతపై అధికారుల దృష్టి పడేనా?
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్ సిబ్బందే రోడ్డు పక్కన చెత్త వేస్తున్నారనే ఆరోపణలు రావడం చర్చనీ యాంశంగా మారింది. చెత్త కారణంగా దుర్వాసనతో పాటు పరిసరాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సంబంధిత ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రజలకు పారిశుద్ధ్య నిబంధనలు సూచించే మున్సిపాలిటీ, వాటిని తన సిబ్బంది కూడా పాటించేలా చూడాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు అభిప్రా యపడుతున్నారు. రూ.500 జరిమానా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ నిబంధనలు ఆచరణలో అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.