మెడికల్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి
డీఎంఈని కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ప్రజాసంఘాల నిరసన
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల(Government Medical College)లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కళాశాల సమస్యలపై విచారణకు హైదరాబాద్ నుంచి వచ్చిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Director of Medical Education)ను కలిసి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించగా సమయం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో డీఎంఈ సమావేశం నిర్వహిస్తున్న మీటింగ్ హాల్ తలుపుకు వినతిపత్రం అంటించి నిరసన తెలిపారు. కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండటం, మెడికల్ హాస్టల్ నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు కోరంగి మాలశ్రీ, కోట శ్రీనివాస్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గోడిసెల కార్తీక్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పద్మ, దుర్గం నిఖిల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.