గోదావరి పుష్కరాల ఏర్పాట్లు చేయాలి
నిర్మల్ నవంబర్ 20 ( విజయక్రాంతి): రానున్న గోదావరి పుష్కరాలను(Godavari Pushkarala) దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని బాసరతో(Basara) పాటు సోన్, ఖానాపూర్ తదితర పుష్కర ప్రాంతాల్లో భక్తులు సౌకర్యవంతంగా పుణ్యస్నానాలు ఆచరించేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
పుష్కరాల సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, అవసరమైన మౌలిక వసతులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి, వాటి అమలుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలన్నారు.
పుష్కర ప్రాంతాల్లో భక్తుల(devotees) రద్దీకి అనుగుణంగా విస్తృతమైన పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా స్పష్టమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడంతో పాటు తాగునీరు, ఇతర అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భక్తులకు(devotees) మార్గదర్శనం చేసేందుకు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
పుష్కరాల నిర్వహణలో ప్రతి అంశాన్ని ముందుగానే పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఉద్యానవన పంటల అధికారి రమణ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూఓ వినూత్న, డీటీడీఓ నిహారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.