రాహుల్ కోసం దేశంలో అరాచకమా?
- దొంగ ఓట్లతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పబ్బం
- ఓటు చోరీతోనే నాలుగు రాష్ట్రాల్లో గెలుపా?
- 70 లక్షల బోగస్ ఓట్లన్నది రాహుల్, సింఘ్వీలే
- తెలంగాణ ‘రేవంతుద్దీన్’ సర్కార్‌గా మారింది
- అక్రమ ఓట్లను ఉపేక్షించం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాహుల్‌గాంధీని(Rahul Gandhi) ప్రధానమంత్రిని చేయాలనే గుడ్డి ఆరాటంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు దేశంలో అరాచకం సృష్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(Ramchander Rao) ఆరోపించారు. దొంగ ఓట్లతోనే ఎంఐఎం(MIM), బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికల సంఘం(Election Commission), సుప్రీంకోర్టు(Supreme Court), రాష్ట్రపతి కార్యాలయం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి మండిపడ్డారు.
గెలిచినప్పుడు ఎన్నికల సంఘాన్ని ప్రశంసించడం.. ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల వ్యవస్థలను తప్పుడు పట్టడం.. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి నిదర్శనమన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 70 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని 2018లో రాహుల్‌గాంధీ, అభిషేక్ మను సింఘ్వీలే ప్రస్తావించారని, ఇప్పుడు ప్రక్షాళన చేస్తుంటే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ఫారమ్- ఫారమ్- భూతంలా చూపిస్తూ ఎన్నికల వ్యవస్థపై విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.
ఎవరైనా తప్పుడు వివరాలతో ఫారం సమర్పించిన మాత్రాన ఓట్లు పోవని, విచారణ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి ‘రేవంతుద్దీన్’ ప్రభుత్వం.. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. ‘దేశ పౌరుల ఓట్లు ఎవ్వరూ తొలగించలేరు. కానీ, బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ ఓట్లను మాత్రం ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు పచ్చి అబద్ధమన్నారు. 2025 జూన్ 24న బిహార్‌లో సర్ ఎన్నికల కమిషన్ ఏకగ్రీవ నిర్ణయంతోనే జరిగిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం ఎన్నికల కమిషనర్ల నిర్ణయాన్ని సమర్థించిందన్నారు.
రాహుల్, సోనియా ఓటు చోరీతోనే గెలిచారా?
దేశవ్యాప్తంగా చనిపోయిన 2.8 కోట్ల మంది పేర్లను ఓటరు జాబితాలో ఉంచాలా? తొలగించాలా? దీనిపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్, సోనియాగాంధీ ఓటు చోరీతోనే ఎంపీలుగా గెలిచారా? తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడింది కూడా అలానేనా? అని నిలదీశారు. 1952 నుంచి 2014వరకు దేశంలో 12సార్లు ఓటరు జాబితా సమగ్ర సవరణ జరిగిందని, ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ దొంగ ప్రభుత్వాలేనా? అని ప్రశ్నించారు.
1993 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రధానమంత్రి స్వయంగా నియమించే విధా నం ఉండేదని, మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తమకు అనుకూలమైన ‘పప్పెట్’లను ఎన్నికల సంఘంలో కూర్చోబెట్టాయా? అని ప్రశ్నించారు. దేశంలో ఈవీఎంలను ప్రవేశపెట్టిందే రాజీవ్‌గాంధీ హయాంలో అని.. తన తండ్రి తీసుకొచ్చిన విధానంపైనే రాహుల్‌గాంధీ అనుమానాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
బోగస్ ఓట్లున్నాయని వారే చెప్పింది
తెలంగాణలో 70 లక్షల పేర్లలో అవకతవకలు జరిగాయని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష వరకు ఫేక్ ఓట్లు ఉన్నాయని 2018 సెప్టెంబర్ 17న కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారని రాంచందర్‌రావు గుర్తు చేశారు. వాటిని జాబితా నుంచి తొలగించాలని రాహుల్‌గాంధీ స్వయంగా డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో 60 లక్షల ‘ఫర్జీ’(నకిలీ) ఓటర్లు, కమల్‌నాథన్, రాజస్థాన్‌లో 45 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని సచిన్ పైలట్ గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు స్వయంగా చెప్పిన 70 లక్షల దొంగ ఓట్లను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి లేదా? నాడు మీరే దొంగ ఓట్లను ఏరివేయాలని డిమాండ్ చేసి, నేడు ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుంటే ఎందుకు గింజుకుంటున్నారని మండిపడ్డారు. 13.3 కోట్ల మంది ఓట్లను తొలగించారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ పొరపాటున ఓటు తొలగించబడినా అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
ఫేక్ ఓట్లతోనే ఎంఐఎం గెలుపు
హైదరాబాద్‌లో పాతబస్తీ ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లూ ఫేక్ ఓట్లు, బోగస్ ఓట్లతోనే గెలుస్తూ వచ్చిందని ఆరోపించారు. వారితో కుమ్మక్కై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూడా లబ్ధిపొందాయ న్నారు. ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుంటే తమ పునాదులు కదులుతాయన్న భయంతో మజ్లిస్ గిలగిలలాడుతోందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఫోన్ చేసి చెప్పగానే, ఇక్కడున్న ‘రేవంతుద్దీన్’ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఫారమ్స్ ఇచ్చిన బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తుందని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఓట్లను సరిపోల్చడానికి ఫారాలను ఇచ్చే హక్కు తమకుందన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియను అడ్డుకుంటూ బీజేపీ కార్యకర్తలపై కేసులు బనాయిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల దేశద్రోహ వైఖరిని తెలంగాణ ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.