చేనేత సహకార సంఘం ఎన్నికల్లో వజ్రమ్మ–వెంకటేశం ఘన విజయం
మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన దంపతులు
మునుగోడు,అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్(All India Handloom Weavers) కో-ఆపరేటివ్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు బుధవారం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించినందుకు హరీశ్‌రావు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.చేనేత రంగంతో పాటు నేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాల కల్పన వంటి అంశాలు అత్యంత ప్రాధాన్యమైనవని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది.
చేనేత రంగం తెలంగాణలో వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉండటంతో సహకార వ్యవస్థ ద్వారా నేత కార్మికులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి జాతీయ స్థాయి చేనేత సహకార సంస్థలో ప్రాతినిధ్యం దక్కడం ద్వారా రాష్ట్రంలోని నేత కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ముడిసరుకు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆధునిక డిజైన్లు, సాంకేతికత, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చేనేత రంగం అభివృద్ధికి కృషి చేయాలి
ఎన్నికల్లో విజయం సాధించిన కర్నాటి వజ్రమ్మ–వెంకటేశం దంపతులు తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని చేనేత కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో వినిపిస్తూ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు.
సహకార సంఘాల ద్వారా నేత కార్మికులకు మరిన్ని అవకాశాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నిరంజన్‌గౌడ్, జగన్, గిరిప్రసాద్ తదితరులు ఉన్నారు.